మోడీ ప్రభుత్వంపై బిఆర్ఎస్ అవిశ్వాసమే

ఇండియా పేరుతో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఏర్పాటుచేసుకొన్న కూటమి, బిఆర్ఎస్ పార్టీ వేరేగా పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. ఈరోజు దానిపై లోక్‌సభలో జరిగిన చర్చలో బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తమ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానానికే మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు. 

మణిపూర్ ఘటనలతో యావత్ ప్రపంచదేశాల ముందు భారత్‌ సిగ్గుతో తల దించుకొనే పరిస్థితి ఏర్పడిందని, అయినా మోడీ ప్రభుత్వం మణిపూర్ అల్లర్లను సమర్ధంగా కట్టడి చేయడంలో విఫలమైందని అన్నారు. 

ఇక్కడ మోడీ ప్రభుత్వం, అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, కానీ ఈ తొమ్మిన్నరేళ్ళలో మోడీ ప్రభుత్వం ఏనాడూ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు లభించనప్పటికీ తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేసి చూపిందని నామా అన్నారు. 

కనీసం రాష్ట్ర విభజన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలుచేయకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని నామా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపడాన్ని నామా నాగేశ్వరరావు లోక్‌సభ సాక్షిగా తప్పుపడుతూ మోడీ ప్రభుత్వం పట్ల అవిశ్వాస తీర్మానానికి బిఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. అయితే తమ పార్టీ ఎన్డీయే, ఇండియా కూటమిలోగానీ లేదని దేశప్రజల తరపున ఉందని నామా నాగేశ్వరరావు చెప్పారు.