
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు వరాలు ప్రకటిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో 7,005 మంది ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలకు రూ.5,000 గౌర్వ వేతనం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి మేరకు పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,005 మందికి గౌరవవేతనం పొందుతారు.
ఇటీవలే ముస్లిం మైనార్టీలకు కూడా గృహాలక్ష్మి పధకం కింద ఒక్కో మహిళకు లక్ష రూపాయలు ఆర్ధికసాయం, 20 వేలమందికి కుట్టు మిషన్లు అందజేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవికాక టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాల పంపిణీ, రైతులకు పంట రుణాల మాఫీ, రైతు బంధు నిధులు విడుదల వంటి అనేక సంక్షేమ పధకాలను జోరుగా చేపడుతోంది.
బహుశః వచ్చే నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు. అది విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు వరాలు ప్రకటించలేదు కనుక తెలంగాణ ప్రభుత్వం ఆలోగా మరిన్ని వరాలు ప్రకటించడం ఖాయమే. కనుక ఎవరికి లబ్ధి కలుగుతుందో చూడాల్సిందే.