ఒకప్పుడు పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండేవి. కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తప్పనిసరిగా హైదరాబాద్ రావలసివచ్చేది. దీని వలన హైదరాబాద్‌లో జనాభా, వాహనాలు, ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని గుర్తించిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఐటి పార్కులు, ఐటి టవర్లు ఏర్పాటు చేయించి ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చేస్తున్నారు.
ఈ ప్రయత్నంలోనే నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఐటి టవర్‌ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఒక ఎకరం స్థలంలో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులుగా నిర్మించారు. దీని పక్కనే మరో 2.5 ఎకరాలను భవిష్యత్‌లో మరో రెండు ఐటి టవర్లను నిర్మించేందుకు కేటాయించారు.
ఈ ఐటి టవర్‌లో పలు ఐటి కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకొని, ఐటి నిపుణులను కూడా నియమించుకొని సిద్దంగా ఉండటంతో మంత్రి కేటీఆర్ ఐటి టవర్‌ను ప్రారంభోత్సవం చేసిన వెంటనే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి.
ఐటి టవర్‌తో పాటు దానికి సమీపంలోనే నిర్మించిన జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని (న్యాక్) కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.6.15 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో జిల్లాలోని యువతీ యుయవకులకు భవన నిర్మాణ రంగానికి చెందిన తాపీ మేస్త్రీ, రాడ్ బెండర్, షట్టరింగ్ కార్పెంటర్, గ్యాస్ కటింగ్, ఎలెక్ట్రీషియన్, ప్లంబర్, ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ సూపర్వైజర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ వంటి వివిద పనులలో శిక్షణ ఇస్తారు. ఏ కారణం చేతైనా ఉన్నత చదువులు చదవలేకపోయిన వారికి మంచి డిమాండ్ ఉన్న ఈ పనులలో శిక్షణ ఇస్తారు.