తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదిన్నరేళ్ళలో హైదరాబాద్ నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో ఫ్లైఓవర్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. నగరంలో లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఇందిరాపార్కు చౌరస్తా నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు 2.62 కిమీ పొడవు గల ఫ్లైఓవర్ నిర్మించింది. ఇది మిగిలిన ఫ్లైఓవర్లకు పూర్తి భిన్నమైనది. ఈ ప్రాంతంలో భూసేకరణ చేయడంవలన చాలా మంది నష్టపోతారు కనుక భూసేకరణ అవసరం లేకుండా తొలిసారిగా పూర్తిగా ఉక్కు (స్టీల్)తో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. రూ.450 కోట్ల వ్యయంతో నాలుగు లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్లో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు వేసారు. ఈ ఫ్లైఓవర్ కోసం 12,316 టన్నుల స్టీల్ వినియోగించారు.
ఈ నెలాఖరుకి ఈ ఫ్లైఓవర్ తుదిమెరుగు పనులన్నీ పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్దం అవుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకి సుమారు లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కనుక ఇందిరాపార్క్ జంక్షన్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, వీఎస్టీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వీఎస్టీ నుంచి కేవలం 4 నిమిషాలలోనే ట్యాంక్‌బండ్ చేరుకోవచ్చు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి స్టీల్ ఫ్లైఓవర్‌గా నిలువబోతోంది.