
గత ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వరరావు, 2018 ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి సిఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. కొన్ని నెలల క్రితం ఖమ్మంలో నిర్వహించిన బిఆర్ఎస్ తొలి సభకు కేసీఆర్ నుంచి ఆహ్వానం రావడంతో తుమ్మల మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు.
ఈరోజు నెలకొండపల్లిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు గాబట్టే నేను పాలేరు పాత కాలువను రూ.70 కోట్లతో మరమత్తులు చేయించగలిగాను. ఆనాడు పాలేరులో చేసిన అభివృద్ధి పనుల కారణంగా ఆ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందింది. అక్కడ భూముల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో రైతులందరూ ధనవంతులయ్యారు. మళ్ళీ నేను పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నాను.
సీతారామ ప్రాజెక్టుని పూర్తిచేసి గోదావరి జలాలను పాలేరుకు తీసుకురావాలనే నేను మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నాను. నాకు సీపీఐతో సహా అనేక పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. పాలేరు ప్రజలు కూడా నావెంటే ఉన్నారు. కనుక ఈసారి పాలేరు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తాను. సీతారామ ప్రాజెక్టు పూర్తిచేసి నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకొంటాను,” అని అన్నారు.
ప్రస్తుతం కందాళ ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలనుకొంటే మరి ఆయన ఏమంటారో?మరోవైపు బిఆర్ఎస్ నుంచి బహిష్కరింపబడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈసారి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ గెలవనీయకుండా అడ్డుకొంటానని భీకర శపధం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిద్దంగా ఉన్న వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక సిఎం కేసీఆర్ ఈసారి తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయించినా ప్రత్యర్ధుల నుంచి గట్టిపోటీయే ఉంటుంది.