ప్రముఖ ఆన్లైన్ ఫర్నీచర్, హోమ్ డెకార్ సంస్థ ‘పెప్పర్ ఫ్రై’ సహవ్యవస్థాపకుడు, సీఈవో అంబరీష్ మూర్తి (51) సోమవారం రాత్రి జమ్ము కశ్మీర్‌లోని లేహ్ వద్ద గుండెపోటుతో చనిపోయారు. ఆయన మిత్రుడు, ఆ కంపెనీలో మరో సహవ్యవస్థాపకుడు ఆశిష్ షా ఎక్స్, “నా స్నేహితుడు, సహచరుడు, పలు విషయాలలో నాకు గురువు అయిన అంబరీష్ మూర్తి ఇక లేరు. నిన్న రాత్రి లేహ్ లో గుండెపోటుతో మృతి చెందారు,” అని ఈ విషయం ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశారు.
భారత్‌లో ఈ కామర్స్ సంస్థలు గట్టిగా నిలద్రొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అంటే 2012లోనే అంబరీష్ మూర్తి, ఆశిష్‌తో కలిసి ఆన్లైన్ ఇంటికి అవసరమైన ఫర్నీచర్, హోమ్ డెకార్ ఐటెమ్స్ అమ్మేందుకు పెప్పర్ ఫ్రై సంస్థను స్థాపించడం చాలా రిస్కుతో కూడిన నిర్ణయమే అని చెపొచ్చు. ముఖ్యంగా ఇంటికి కావలసిన ఫర్నీచర్‌ను స్వయంగా కళ్ళారా చూసి, చేతులతో తాకితేకానీ కొనే అలవాటులేని భారతీయులకు, ఆన్లైన్లో ఫర్నీచర్ ఫోటోలు చూపించి అమ్మడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. కానీ ఆశిష్, అంబరీష్ ఇద్దరూ కలిసి చాలా నాణ్యమైన ఫర్నీచర్‌ను సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో అందజేస్తూ క్రమంగా దేశప్రజల నమ్మకం సంపాదించుకొన్నారు. అదే పెప్పర్ ఫ్రై విజయ రహస్యం అని వారు చెపుతుంటారు.
అంబరీష్ మూర్తికి బైక్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. అదో హాబీ కూడా. కనుక ఎప్పటిలాగే ముంబై నుంచి లేహ్ కు బైక్‌పై వెళ్లారు. కానీ అక్కడకు చేరుకొన్న తర్వాత అంబరీష్ మూర్తికి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్ళేలోగా కన్ను మూశారు.
అంబరీష్ మూర్తి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత ఐఐఏం కోల్‌కతాలో చేరి ఎంబీఏఏ చేశారు. ఆ తర్వాత ఈబే ఆన్లైన్ సంస్థలో చేరి భారత్, ఫిలిపిన్స్, మలేషియా దేశాలలో పనిచేసి మంచి అనుభవం సంపాదించారు. 2012లో స్నేహితుడు ఆశిష్‌తో కలిసి పెప్పర్ ఫ్రై ఏర్పాటు చేసి కేవలం 5-6 ఏళ్ళలో దేశంలో తిరుగులేని సంస్థలలో ఒకటిగా నిలిపారు.
అంబరీష్ మూర్తి ఆకస్మిక మృతి పట్ల దేశంలో వివిద రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నివాళులు ఆర్పిస్తున్నారు.