నేతన్నలను మరే ప్రభుత్వమైనా ఇంతగా ఆదుకొందా?

దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొన్నంతగా ఆడుకొని ఉండదు. అసలు పొరుగున ఏపీతో సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు చేనేత అంటే చాలా చిన్నచూపు. చేనేత రంగాన్ని దానిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది చేనేత కార్మికుల కుటుంబాలను, వారి కష్టానష్టాలను పట్టించుకోవు. కానీ తెలంగాణ ప్రభుత్వం వారిని కష్టాల నుంచి బయటపడేసి చేనేత రంగానికి పూర్వవైభవం కల్పించేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బతుకమ్మ చీరలు అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిన్న జరిగిన చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ నేత కార్మికులపై వరాలు కురిపించారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

1. సోమవారం నుంచే ‘తెలంగాణ చేనేత మగ్గం పధకం’ అమలు. దీని కోసం రూ.40.50 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

2. నేతన్నలకు పాత మగ్గాల స్థానంలో 16 వేలకు పైగా కొత్త మగ్గాలు అందిస్తాం. 

3. వచ్చే నెల నుంచి చేనేత మిత్ర పధకం కింద రాష్ట్రంలో ప్రతీ చేనేత మగ్గానికి నెలకు రూ.3,000 ఇస్తాం. 

4. రాష్ట్రంలో చేనేత కార్మికులకు, వారి అనుబందంగా పనిచేసే కార్మికులు అందరికీ ప్రభుత్వం ఉచితంగా గుర్తింపు కార్డులు అందజేస్తుంది. 

5. చేనేత కార్మికులు ఉపయోగించే రసాయనాల వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఉచిత వైద్యచికిత్సలు అందించేందుకు చేనేత హెల్త్ కార్డ్స్ అందిస్తాం. 

6. 59 ఏళ్ళు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే భీమా కల్పిస్తుంది. 

7. చేనేత సహకార సంఘాలకు ముడిసరుకు కొనుగోలు చేసేందుకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్లు క్యాష్ క్రెడిట్ (పెట్టుబడి) అందిస్తాం. 

8. చేనేత కార్మికులు పని చేసుకొనేందుకు షెడ్లు నిర్మించుకొనేందుకు సహాయం చేస్తాం. 

9. శిల్పారామం పక్కనే ఓ హ్యాండ్‌లూమ్ మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. తద్వారా అక్కడికి వచ్చే పర్యాటకులు మన నేతన్నల అద్భుతమైన నైపుణ్యం చూడగలుగుతారు. అక్కడే చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తే నేతన్నలకు ఎంతో మేలు కలుగుతుంది.