టీఎస్‌ఆర్టీసీ బిల్లుకు శాసనసభ ఆమోదం

నాటకీయ పరిణామాల అనంతరం నిన్న టీఎస్‌ఆర్టీసీ బిల్లుకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలుపగా, వెంటనే దానిని శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు.  

టీఎస్‌ఆర్టీసీ బిల్లులో సంస్థ ఆస్తులు, అప్పులు, కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ తదితర అంశాల గురించి గవర్నర్‌ వివరణ కోరగా రవాణాశాఖ ముఖ్యకార్యాదర్శి, ఆర్‌ అండ్ బి, ఆర్ధికశాఖల అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్ళి ఆమె సందేహాలు నివృత్తి చేశారు. దాంతో ఆమె ఆమోదముద్ర వేశారు. 

ఆ తర్వాత రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా దానిపై సభ్యులు చర్చించి ఆమోదముద్ర వేశారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై నిశిత విమర్శలు చేశారు. “ఆమెకు తెలిసీ తెలియక ఈ బిల్లుపై అనవసరమైన రగడ సృష్టించారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మేము దనైలో పనిచేసే ఉద్యోగులకు మరింత మెరుగైన జీతభత్యాలు అందించాలనుకొంటే, మేము ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేశామంటూ ప్రతిపక్షాలు నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నాయి. 

ప్రతీ అంశంపై రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు ఓ దూరలవాటుగా మారిపోయింది. ఆర్టీసీని, ఉద్యోగులను కాపాడుకొనేందుకు మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో వారికీ తెలుసు. ఒకేసారి 43 వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకోవడం వలన ప్రభుత్వంపై రూ.3,000 కోట్ల అధనపు భారం పడుతుంది. అయినా మేము ఆర్టీసీ ఉద్యోగుల కోసం అంత భారం స్వీకరించేందుకు సిద్దమైతే ప్రతిపక్షాలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.