
తెలంగాణ శాసనసభ సమావేశాలలో నేడు కాంగ్రెస్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ, “కాంగ్రెస్ పార్టీ ఓ చచ్చిన పాము లాంటిది... ఎక్స్పైరీ డేట్ వచ్చేసిన మందు వంటిది. దాని వలన ఎవరికీ ప్రమాదం లేదు... ఉపయోగం కూడా లేదు.
కనుక కాంగ్రెస్ పార్టీని పట్టించుకోనవసరం లేదు. పక్కింట్లో పెళ్ళి జరిగితే ఇరుగుపొరుగులు హడావుడి పడిన్నట్లు కర్ణాటకలో ఏదో గాలివాటంగా కాంగ్రెస్ గెలిస్తే, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అప్పుడు అధికారంలోకి వచ్చేసిన్నట్లు ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకొంటున్నారు.
ఒకరు సీతక్క సిఎం అంటే మరొకరు ఆమె సిఎం ఏంది... పెద్ద జోక్ నేనే సిఎం అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. అయితే ఎలాగూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖతం అయిపోతుంది. అంతవరకు కాంగ్రెస్ నేతలు సిఎం పదవి గురించి ఎన్ని ముచ్చట్లైనా పెట్టుకోవచ్చు,” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి శాసనసభలో అడుగుపెట్టలేకపోయినా, జూబ్లీహిల్స్లో మీడియా సమావేశం పెట్టి సిఎం కేసీఆర్, మంత్రులపై నిప్పులు చెరిగారు.
“రాష్ట్రంలో వరదలొచ్చి ప్రజలు, రైతులు అల్లాడిపోతుంటే సిఎం కేసీఆర్ వారిని పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతులను ఉద్దరిస్తానంటూ రాజకీయయాత్రలు చేశారు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ మీద మోజు తీరిపోయింది. అందుకే మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి కాకపోతే కనీసం మంత్రులైనా వరద ప్రాంతాలలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పి సాయం చేయొచ్చు కదా? ఏం రాష్ట్రంలో మంత్రులందరూ కూడా వరదల్లో కొట్టుకుపోయారా?” అని ప్రశ్నించారు.
“ప్రభుత్వం వరద బాధితులను ఆదుకొని ఉంటే మా ఎమ్మెల్యే సీతక్క కన్నీరు ఎందుకు పెడుతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాఫ్టర్ పంపించాలని ఆమె కన్నీళ్ళు పెట్టుకొని ప్రభుత్వానికి మొరపెట్టుకొన్నా పట్టించుకొన్న నాధుడే లేడు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు కూడా వారి వద్దకు వెళ్ళని ముఖ్యమంత్రి, మంత్రులు అవసరమా?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“బిఆర్ఎస్ పార్టీలో అందరికీ ఎంతసేపు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా ఎలా వాటిని కబ్జా చేద్దామనే ఆలోచన తప్ప ప్రజలు పట్టరు. కేసీఆర్ కుటుంబమే హైదరాబాద్ చుట్టుపక్కల 10 వేల ఎకరాలు కబ్జా చేసింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దొరికినకాడికి భూములు కబ్జాలు చేసేస్తున్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోఘర్ రెడ్డి దేవుడి భూములను కబ్జా చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి. కేసీఆర్ ఓ బ్రహ్మ రాక్షసుడు. ఆయన ఈ రాక్షసులందరినీ పుట్టించి ప్రజల మీదకు వదిలారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకొంటున్నారు,” అని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
“కేసీఆర్కు, బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. ఇక వారు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు కూడా నమ్మడంలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటుంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు.