ఈరోజు శాసనసభలో పెద్దపల్లి జిల్లా మందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దీళ్ళ శ్రీధర్ బాబు సింగరేణి గనుల ప్రైవేటైజేషన్, కార్మికులు, నిర్వాసితుల సమస్యల గురించి కేసీఆర్ ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పాల్సిందిగా కోరారు.
1. కేంద్రప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ (మైనింగ్ నియంత్రణ) చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు బొగ్గుగనుల ప్రయివేటీకరణపై చర్చ జరిగింది. అప్పుడు 13 మంది బిఆర్ఎస్ ఎంపీలు దానికి మద్దతు పలికారు. ఆ తర్వాత కేంద్రం సింగరేణికి చెందిన నాలుగు గనులను వేలం వేసేందుకు సిద్దమైంది. పార్లమెంటులో మైన్స్ ప్రయివేటీకరణకు మద్దతు పలికిన బిఆర్ఎస్ పార్టీ, సింగరేణి గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తోంది.
2. ప్రస్తుతానికి ఆ వేలం నిలిచిపోయినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయబోతోంది?
3. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ, మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్స్ పేరుతో సింగరేణిలో అనేక గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది.
4. తాడిచర్లలో జెన్కోకు, ఇందారం, గోదావరిఖని, సత్తుపల్లి, ధావన్ పల్లి, మందమర్రి గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
5. ఈ ప్రైవేట్ సంస్థలలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరినీ సింగరేణిలోకి తీసుకొని వారికి ఉద్యోగభద్రత, తగిన జీతభత్యాలు చెల్లించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా?
6. సింగిరెడ్డిపల్లి, మంగళపల్లి, అడ్రియాల్ రచ్చపల్లి, పెద్దంపేట, జల్లారం తదితర గ్రామాల నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఎప్పటిలోగా చెల్లిస్తారు? అని ప్రశ్నించారు.