
టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే సమాధానాలు తెలియజేస్తూ రాజ్‌భవన్‌కు శనివారం మధ్యాహ్నం ఓ లేఖ పంపింది.
టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆ సంస్థలో కంటే మెరుగైన జీతాలు ఇస్తామని తెలిపింది. వారి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ప్రయోజనాలు, హక్కులు, పదవీ విరమణ తర్వాత పెన్షన్ వగైరాలన్నీ కమిటీ రూపొందించే మార్గదర్శకాలలో పేర్కొంటామని తెలిపింది. టీఎస్‌ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలోనే పరిష్కరించుకొంటామని పేర్కొంది. గవర్నర్ అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినందున టీఎస్‌ఆర్టీసీ బిల్లును తక్షణం ఆమోదించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరి గవర్నర్ ఆమోదిస్తారో లేదో మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.
శనివారం మధ్యాహ్నం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్ ముట్టడించగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. తాను గతంలో వారు సమ్మేచేసినప్పుడు వారికే మద్దతు ఇచ్చానని, ఇప్పుడు కూడా వారితోనే ఉన్నానని వారి ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లుపై ప్రభుత్వాన్ని వివరణ కోరానని చెప్పారు. ముఖ్యంగా వారి జీతభత్యాలు, పెన్షన్, ఉద్యోగ భద్రతల గురించే తాను ఆలోచించి ప్రభుత్వాన్ని వివరణ కోరానని చెప్పారు. బిల్లును ఆపాలనే దురుదేశ్యం తనకు ఏమాత్రం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.