అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు హైకోర్టు వరుసగా షాకులు ఇస్తోంది. శాసనసభ సమావేశాలకు ముందు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయడంతో ఆయన సమావేశాలకు దూరంగా ఉండిపోవలసివచ్చింది. గత ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ను ఓ రిటర్నింగ్ అధికారి సాయంతో మార్చేశారనే కేసు నమోదు కాగా దాని విచారణ నిలిపివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కనుక ఆ కేసు విచారణ కొనసాగుతోంది.
తాజాగా పెద్దపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి హైకోర్టు నోటీస్ జారీ చేసింది. జిల్లాలోని ముత్తారం ధర్మాబాద్ పంచాయితీ పరిధిలో గల శ్రీ రంగనాయకస్వామి ఆలయ భూములను ఆయన అక్రమంగా తన పేరు మీదకి బదిలీ చేయించుకొన్నారని ఆరోపిస్తూ చందపల్లికి చెందిన జాపతి రాజశేఖర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆయనతో పాటు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి, దేవాదాయశాఖ కమీషనర్‌కు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవో, తహశీల్దార్, ఆలయ ఈవోకు కూడా నోటీసులు జారీ చేసింది.