గవర్నర్‌ తీరుకి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులు మెరుపు ధర్నా

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలుపకపోవడంతో శనివారం ఉదయం హైదరాబాద్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో ఉద్యోగులు మెరుపు ధర్నా చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు డిపోలలో నుంచి బస్సులు బయటకు తీయకుండా నిలిపివేసి నిరసనలు తెలియజేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌, ట్యాంక్‌బండ్‌ నుంచి ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి రాజ్‌భవన్‌ ముట్టడించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. గవర్నర్‌ తక్షణమే టీఎస్‌ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక దీక్షకు వెంకాడబోమని యూనియన్ నేతలు హెచ్చరించారు. 

ఈ వ్యవహారంపై గవర్నర్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులే రంగంలో దిగారు కనుక సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులందరూ సంయమనం పాటిస్తూ మౌనంగా ఉన్నారు. బహుశః ఈరోజు శాసనసభ సమావేశాలలో ఈ అంశంపై కేసీఆర్‌ మాట్లాడే అవకాశం ఉంది.  

ఈ బిల్లు ఆర్ధికాంశాలతో ముడిపడి ఉంది కనుక దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవలసి ఉందని కనుక ఈ బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్‌ నిన్న ప్రకటించింది.