3.jpg)
నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు ముచ్చటగా ముగిసిపోనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమైన తర్వాత ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
పార్టీలకు అతీతంగా సభ్యులు అందరూ సాయన్నకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు సాయ్యన్నతో తమ అనుబందాన్ని గుర్తు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు సభలో అందరూ భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో బిఆర్ఎస్ తరపున మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క, మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
శాసనసభలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కనుక కనీసం పది రోజులు సమావేశాలు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కానీ కేవలం మూడు రోజులే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మూడు రోజుల్లో నేడు ఒక రోజు అయిపోయింది. కనుక శుక్ర, శనివారాలు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. శుక్రవారం వరద పరిస్థితులపై చర్చ, శనివారం వివిద బిల్లులని ప్రవేశపెట్టి చర్చించి వెంటనే ఆమోదిస్తారు. వాటిలో గవర్నర్ తిప్పి పంపిన రెండు బిల్లులు కూడా ఉంటాయని మంత్రి కేటీఆర్ ఇప్పటికే చెప్పారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసినందున సమావేశాలకు హాజరుకాలేదు. జలగం వెంకట్ రావుని ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, ఈ తీర్పును సవాలు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసినందున జలగం వెంకట్ రావు కూడా హాజరుకాలేదు.