బిజెపిలో జయసుధ, కాంగ్రెస్‌లో జూపల్లి, గురునాధ్ రెడ్డి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలు, నేతల హడావుడి మొదలైపోయింది. జూపల్లి కృష్ణారావు సస్పెన్స్‌కు తెర దించుతూ ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకూళ్ళ దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈరోజు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మాణిక్‌రావు థాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, వేణుగోపాల్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

ప్రముఖ నటి, మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జయసుధ బుదవారం ఢిల్లీకి వెళ్ళి బిజెపి జాతీయ కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ కార్యదర్శి డికె అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆమె ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్‌ నుంచి శాసనసభకు పోటీ చేయవచ్కఃని సమాచారం. అయితే తాను టికెట్‌, పదవులు ఆశించి బిజెపిలో చేరలేదని ఆమె చెప్పారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు.