కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి జయసుధ త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. తెలంగాణ బిజెపి చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆహ్వానం మేరకు ఆమె బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.
జయసుధ 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి బిజెపిలోనైనా ఇమడగలరో లేదో తెలీదు. ఆమెను మళ్ళీ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలో దింపాలని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం.
ఈసారి శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావలాని బిజెపి పట్టుదలగా ఉంది. కనుక ఆమెతో సహా సినిమా ఇండస్ట్రీలో మరికొందరిని పార్టీలోకి తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయశాంతి బిజెపిలో ఉన్నారు. మంచు మోహన్ బాబు కూడా బిజెపి పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సినీ పరిశ్రమలో జీవిత రాజశేఖర్ వంటి పలువురు నటీనటులు బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. కనుక ఈసారి ఎన్నికల బరిలో బిజెపి ‘స్టార్ బ్యాచ్’ దిగే అవకాశం కనిపిస్తోంది.