తెలంగాణ సిఎం కేసీఆర్ మహారాష్ట్రలో తన బిఆర్ఎస్ పార్టీని విస్తరించే ప్రయత్నాలలో భాగంగా మంగళవారం వటేగావ్లో బహిరంగసభ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు విమానంలో చేరుకొని నేరుగా మహాలక్ష్మీ మాతా అంబాబాయి ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు. అక్కడి నుంచి సాంగ్లి జిల్లాలోని వటేగావ్లో చేరుకొని బహిరంగసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ స్థానిక మరాఠీ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్, బిజెపిలు పాలిస్తున్నాయి. కానీ నేటికీ రైతుల కష్టాలు తీరలేదు. ప్రజల పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు. నేటికీ ఔరంగాబాద్ వంటి పెద్ద నగరంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో కృష్ణాగోదావరి నదులు పారుతున్నా రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
కనుక దేశంలో మార్పు తీసుకురావడం కోసమే మేము ఈ పోరాటం మొదలుపెట్టాము. అయితే మేము ఏ కూటమిలోనూ లేము. అలాగని ఒంటరిగా కూడా లేము. మాకు మిత్రులు ఉన్నారు. మనకు కావలసింది ఎన్డీయే, ఇండియా కూటములు కావు. నయా (కొత్త) ఇండియా. దాని కోసమే మేము ముందుగా మహారాష్ట్రలో పని ప్రారంభించాము. మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీకి 14.10 లక్షల మంది పదాధికారులున్నారు. త్వరలోనే గ్రామస్థాయిలో కమిటీల నిర్మాణం కూడా పూర్తిచేసుకొని మా పోరాటాలను ఉదృతం చేస్తాము.
దళిత కవి అన్నాభావ్ సాఠే సమ సమాజస్థాపనకు తన రచనలతో ఎంతగానో కృషి చేశారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాము. మహారాష్ట్ర అణగారిన మాతంగి సమాజాన్ని ఇక్కడి ప్రభుత్వం గుర్తించడమే లేదు. వారికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. చట్టసభలలో వారికీ ప్రాతినిధ్యం కల్పిస్తుంది,” అని అన్నారు. బహిరంగసభ ముగిసిన తర్వాత సిఎం కేసీఆర్ మళ్ళీ కొల్లాపూర్ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకొన్నారు.