అయ్యో! కొప్పుల ఈశ్వర్ కూడానా?

బిఆర్ఎస్‌ పార్టీ త్వరలోఏ జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమవుతుండగా, తెలంగాణ హైకోర్టు వరుసపెట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను విచారణకు చేపడుతూ షాకులు ఇస్తోంది. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు చెప్పగా, ఆ తర్వాత వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణను నిలిపివేయడానికి తిరస్కరించి మరో షాక్ ఇచ్చింది. 

తాజాగా ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికపై విచారణను నిలిపివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌జూ తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి లక్ష్మణ్ కుమార్‌ మూడేళ్ళ క్రితం హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిపై అప్పటి నుంచి విచారణ జరిపింది. 

ఇటీవలే ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. ఇక కోర్టు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది. ఇటువంటి సమయంలో ఈ కేసు విచారణ నిలిపివేయాలని మంత్రి కొప్పుల కొరడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఆయన వేసిన మద్యంతర పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుపై బుదవారం తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.