
మంచు మనోజ్ దంపతులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కలవడంపై నిన్నటి నుంచి మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనోజ్ భార్య మౌనిక రెడ్డి దివంగత భూమారెడ్డి దంపతుల కుమార్తె. ఆమె అక్క అఖిలప్రియ టిడిపిలోనే ఉన్నారు.
కనుక మౌనిక రెడ్డి కూడా టిడిపిలో చేరబోతోందని ఆ ఊహాగానాల సారాంశం. అయితే మంచు మనోజ్ దంపతులు చంద్రబాబు నాయుడుని కలిసి బయటకు వచ్చిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, “ఆయన మాకు చాలా కావలసినవారు. ఆత్మీయుడు. కనుక ఆయన ఆశీర్వాదాలు తీసుకొనేందుకే వచ్చాము. మా పెళ్ళయిన తర్వాత వెంటనే వచ్చి కలుద్దామనుకొన్నా ఆయన చాలా బిజీగా ఉండటంతో ఇంతకాలం కుదరలేదు. ఇప్పుడు ఆయనే ఫోన్ చేసి రమ్మనమని ఆహ్వానించడంతో వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకొన్నాము. ఇన్నాళ్ళకు ఆయన ఆశీర్వాదం లభించినందుకు మేము చాలా సంతోషించాము. మేము రాజకీయాల గురించి ఏమీ చర్చించలేదు,” అని మనోజ్ చెప్పారు.
“రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదా?” అంటూ విలేఖరుల ప్రశ్నకు ప్రస్తుతానికైతే లేదు. ఎప్పుడైనా ఆ ఆలోచన చేస్తే తప్పకుండా చెప్తాము,” అని ఆమె జవాబు చెప్పారు.