హైదరాబాద్‌ అవుటర్‌లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌ నగరానికి అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు తరలివస్తుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా పొరుగునే ఉన్న ఏపీతో సహా వివిద రాష్ట్రాల నుంచి అనేకమంది వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడుతున్నారు. దీంతో నగరంలో జనాభా, వాహనాలు, ట్రాఫిక్ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

కనుక ప్రజారవాణా వ్యవస్థను మరింత విస్తరించుకోవలసి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్ వెంబడి 278 కిమీ పొడవునా మెట్రో కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. 

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జల్ పల్లి, తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు మెట్రోని విస్తరించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు 3వ దశలో భాగంగా చేపట్టబోయే దీనిని రాబోయే 4-5 ఏళ్ళలో నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం సుమారు రూ.69,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు  నిర్మాణం కోసం కేంద్రం సాయం కోరాలని, ఒకవేళ కేంద్రం సాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. 

దీనిలో భాగంగా జూబ్లీబస్టాండ్ నుంచి తూంకుంట వరకు ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మరొకటి నిర్మిస్తారు. వాటిలో కింది వంతెనపై మెట్రో రైళ్ళు, పైవంతెనపై వాహనాలు నడుస్తాయి. 

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు 3వ దశలో భాగంగా మెట్రో కారిడార్‌ను నగరంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఇస్నాపూర్-మియాపూర్, మియాపూర్-లక్డీకపూల్, ఎల్బీనగర్‌-హయత్ నగర్‌ మీదుగా అంబర్ పేట, ఉప్పల్-బీబీ నగర్, ఉప్పల్-ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, కొత్తూరు-షాద్ నగర్‌ మద్య మెట్రో కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిమీ మేర మెట్రోని పొడిగించేందుకు సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేశారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభం అవుతాయి. పాతబస్తీలో మెట్రో పనులు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.