టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం: కేటీఆర్‌

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దానిలో పనిచేస్తున్న 43,373 మందిని ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ఇతర మంత్రులతో కలిసి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈవిషయం స్వయంగా ప్రకటించారు. 

ఈ విలీన ప్రక్రియకు విధివిధానాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని నియమించిన్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో ఆర్‌ అండ్ బి, రవాణా, కార్మిక, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరగా విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీని ఆదేశించామని తెలిపారు. 

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు బిల్లును ఆగస్ట్ 3 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకొన్న మరికొన్ని ముఖ్య నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్‌ మీడియాకు వివరించారు. 

1. వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఆర్ధికసాయం అందించేందుకు తక్షణం రూ.500 కోట్లు విడుదల. 

2. వరదలలో మరణించిన 40 మందికి వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తుంది. 

3. రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటుకి ఆమోదం. 

4. వరంగల్‌ జిల్లాలో మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకి అవసరమైన భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించాలని నిర్ణయం. 

5. హకీంపేట విమానాశ్రయాన్ని పౌరవిమానయాన సేవలకు వినియోగించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాయాలని నిర్ణయించారు.