
తెలంగాణ ప్రజలకు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన గత కొన్నేళ్ళుగా తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ గద్దె దించుతానని శపధాలు చేస్తున్నారు.
అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ నమ్మకం సన్నగిల్లిన్నట్లుంది. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లున్నారు. ఆయన ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. తనకు మేడ్చల్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నట్లు మల్లన్న చెప్పిన్నట్లు తెలుస్తోంది. ఈవిషయం పార్టీ రాష్ట్ర అధిష్టానానికి తెలియజేసి సమాధానం చెపుతానని ఎడవల్లి కృష్ణ చెప్పిన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనుకొంటే, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అక్కడ అధికారంలోకి రావడంతో మళ్ళీ అనూహ్యంగా పుంజుకొంది. సరిగ్గా ఇదే సమయంలో బిజెపి అధిష్టానం బండి సంజయ్‌ని తప్పించేయడంతో రాష్ట్రంలో బిజెపి పరిస్థితి అయోమయంగా మారడం కూడా కాంగ్రెస్‌కు బాగా కలిసొస్తోంది. కనుక టికెట్ ఆశించేవారందరూ కాంగ్రెస్ పార్టీవైపే చూస్తున్నారు. వారిలో తీన్మార్ మల్లన్న కూడా ఒకరనుకోవాలి.