నేడు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

ఆగస్ట్ 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నందున ప్రధానంగా దానిపైనే చర్చ జరుగనుంది.

వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరుగగా, అనేక ప్రాంతాలలో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక ముందుగా సహాయచర్యలు, పంట నష్టానికి పరిహారం చెల్లింపు, యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొనున్నారు. 

మరో నెలరోజుల్లో శాసనసభ ఎన్నికల గంట మ్రోగనున్నది. అప్పుడు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేస్తుంది. దాంతో కొత్తగా ఎటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలను ప్రారంభించడానికి వీలు ఉండదు. కనుక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గృహాలక్ష్మి, గిరిజన బంధు, మైనార్టీ బంధు ఇంకా మరికొన్ని సంక్షేమ పధకాలపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 

అలాగే ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులను, టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రసన్నం చేసుకొనేందుకు కొన్ని వరాలకు ఆమోదముద్ర వేయవచ్చు. హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రో పనులకు నిధులు కేటాయించే అవకాశం కూడా ఉంది. ఇవికాక పాలనాపరమైన కొన్ని బిల్లులకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్రవేయనున్నారు.