
ఆగస్ట్ 3వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత సమావేశాలకు ఇవి కొనసాగింపని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ప్రకటించారు. ముందుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి ఉభయసభలు సంతాపం తెలుపుతాయి.
ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? సమావేశాలలో చర్చించాల్సిన అంశాలకు సంబందించి అజెండాను ఖరారు చేస్తారు. ఈసారి 5 నుంచి 10 రోజ్లు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నెలాఖరులోగా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది కనుక ఇవే చివరి సమావేశాలు. కనుక ఈసారి ప్రధానంగా సంక్షేమ పధకాలపైనే చర్చ జరిపి, కొత్తగా ప్రవేశపెట్టబోతున్న పధకాలకు సంబందించిన బిల్లులకు ఆమోదముద్ర వేయవచ్చు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో అనేక పట్టణాలు, గ్రామాలు నీటమునిగాయి. హైదరాబాద్ నగరంలో కూడా పలు కాలనీలలోకి వరద నీరు ప్రవహిస్తోంది. నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కానీ ప్రభుత్వం సహాయచర్యలు చేపట్టడంలో అశ్రద్ద వహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుక ఈ సమావేశాలలో ప్రతిపక్షాలు ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ఖాయమే.