
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణ కోసం మహిళనైన తనను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఒంటరిగా విచారణ జరుపుతుండటాన్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
దానిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆమె పిటిషన్ను పరిగణనలోకి తీసుకొంటున్నట్లు ప్రకటించి, ఆరు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.
ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపై తన వాదనలు తెలియజేస్తూ రెండు వారాలలోగా రీజయిండర్ దాఖలు చేయాలని కల్వకుంట్ల కవితని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే అంతవరకు ఆమె జోలికి ఈడీ వెళ్ళలేదన్న మాట!
అయితే లిక్కర్ స్కామ్ కేసులో 3-4 నెలల క్రితం చాలా హడావుడి చేసిన ఈడీ హటాత్తుగా చల్లబడిపోయింది. బహుశః కర్ణాటక శాసనసభ ఎన్నికలకు కేసీఆర్ దూరంగా ఉండేందుకు అంగీకరించినందున కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ దూకుడుకి మోడీ బ్రేకులు వేసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపించాయి.
కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు ఈడీ సైలంట్ అయిపోయింది. కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వలన కల్వకుంట్ల కవితకు కొత్తగా ఒరిగేదేమీ లేదనే చెపొచ్చు. ఒకవేళ మళ్ళీ ఈడీ యాక్టివ్ అయినా మరో రెండు నెలల వరకు ఆమె జోలికి వెళ్ళలేదు!