తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి బుదవారం పార్టీ కార్యాలయంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బిజెపి నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బైటాయించి ఆందోళన చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేఖంగా వారు నినాదాలు చేశారు.
అర్వింద్ ఒత్తిడితోనే జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య జిల్లాలోని 13 మండలాలో అధ్యక్షులను పార్టీ నిబందనలకు వ్యతిరేకంగా మార్చారని వారు ఫిర్యాదు చేశారు. కనీసం తమతో చర్చించకుండా మండల అధ్యక్షులను మార్చిన్నట్లు వాట్సప్ గ్రూపులలో మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం ఏమిటని ప్రశ్నించారు.
అయితే పార్టీ కార్యాలయంలో క్యాడర్ గొడవకు అసలు కారణం బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో బిజెపి టికెట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటమే కారణమని తెలిసింది. టికెట్ ఆశిస్తున్న మోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వినయ్ రెడ్డి, బసవ లక్ష్మీ నరసయ్యల మద్య జరుగుతున్నా వర్గపోరు పరాకాష్టకు చేరుకోవడంతో నిజామాబాద్ నుంచి బిజెపి క్యాడర్ హైదరాబాద్ వచ్చి హంగామా చేసిన్నట్లు తెలుస్తోంది.
వారికి బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తదితరులు నచ్చజెప్పి బయటకు పంపించేందుకు ప్రయత్నించినా వారు వినకుండా పార్టీ కార్యాలయంలోనే బైటాయించి నినాదాలు చేస్తుండటంతో రెండో అంతస్తులో ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కిందకు వచ్చి వారితో మాట్లాడి ఈ వ్యవహారాన్ని తాను స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటానని సముదాయించి పంపించేశారు.