మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కూడా హైకోర్టు షాక్

తెలంగాణ హైకోర్టు అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుసపెట్టి షాకులు ఇస్తోంది. మంగళవారం ఉదయం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటువేసిన హైకోర్టు, మధ్యాహ్నం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు షాక్ ఇచ్చింది. ఆయన కూడా 2018 ముందస్తు ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని, కనుక ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్ రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

దానిపై ఇదివరకే హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఆ పిటిషన్‌ విచారణకు అర్హత లేదని కనుక దానిని కొట్టివేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ పిటిషన్‌ వేశారు.కానీ హైకోర్టు ఆయన పిటిషనునే కొట్టివేసి విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.     

2018 ముందస్తు ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్‌ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికలకు ముందు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌, ఎన్నికలు పూర్తయ్యేసరికి మారిపోయిందని, శ్రీనివాస్ గౌడ్‌ రిటర్నింగ్ అధికారిని ప్రలోభపెట్టి ఆయన సాయంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నమోదు చేయబడిన తన అఫిడవిట్‌ను మార్చేశారని పిటిషనర్‌ ఫిర్యాదు చేశాడు.

కనుక శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదని, మంత్రిగా ఆ పదవిలో కొనసాగానికి అనర్హుడని ప్రకటించాలని పిటిషనర్‌ కోరుతున్నాడు. దీనిపై కేంద్ర ఎన్నికల కమీషన్‌ విచారణ జరుపుతోంది. కానీ ఈలోగా హైకోర్టు శ్రీనివాస్ గౌడ్‌పై కూడా అనర్హత వేటు వేస్తే ఆయనకు, బిఆర్ఎస్‌ పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది.