
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బిఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం అంతకంతకూ ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ, కొన్ని నియోజకవర్గాలలో ఆ పరిస్థితి లేదు. కనుక వీలైనంత త్వరగానే అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని సిఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
ముందుగా ఆగస్ట్ మూడో వారంలో ఎటువంటి ఇబ్బందులు లేని సుమారు 50కి పైగా స్థానాలకు అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండో జాబితాలో ఎక్కువ మంది పోటీపడుతున్న మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
సిఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించి వారిలో చాలామంది పేర్లు ఖరారు చేశారు. కనుక ఆభ్యర్ధుల పేర్లను ప్రకటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక నియోజకవర్గాలలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారి స్థానంలో పోటీ చేసేందుకు పార్టీలో అనేకమంది సిద్దంగా ఉన్నారు లేదా ఇతర పార్టీల నుంచి వచ్చి పోటీ చేసేందుకు అనేకమంది సిద్దంగా ఉన్నారు. అయితే ఈ స్థానాలకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంటుంది. కనుక రెండో జాబితాలో ఇటువంటి స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయవచ్చని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టికెట్స్ దొరకవని భావించి పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్న తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వంటి వారిని మరోసారి బుజ్జగించి చూడాలని, అప్పటికీ వారు బయటకు వెళ్ళిపోవాలనుకొంటే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీలోనే టికెట్స్ కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందున, టికెట్స్ ఆశించి పార్టీలో చేరాలనుకొనేవారిని తప్పనిసరి అయితేనే పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.