వెరైటీగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా పార్టీలో అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. కొందరు స్వయంగా పూల బొకేలు అందించి తెలియజేస్తున్నారు. మరికొందరు తమ తమ నియోజకవర్గాలలో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే వారందరిలో అలిశెట్టి అరవింద్ అనే బిఆర్ఎస్ నాయకుడు చాలా వినూత్నంగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ బస్సు పొడవునా రెండువైపులా కేటీఆర్‌ చిత్రం, ఆయన చేసిన అభివృద్ధి పనులతో కూడిన ఓ భారీ బ్యానర్‌ ముద్రింపజేశారు. అది కొత్తగా నిర్మించిన సచివాలయం దగ్గరుకు వచ్చినప్పుడు కొందరు ఆ బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అవుతోంది. బస్సులు, చివరికి విమానాలపై సినిమా పోస్టర్స్ లేదా హీరోల పోస్టర్స్ చూశాము కానీ తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్‌ చూడటంతో, నగరంలో ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసి బంధుమిత్రులకు పంపిస్తున్నారు. 

మంత్రి కేటీఆర్‌ ఈరోజు తన 47వ పుట్టినరోజు సందర్భంగా యూసఫ్ గూడా స్టేట్ హోమ్‌కు వెళ్ళి అక్కడ 10,12 తరగతుల్లో ప్రతిభా కనబరిచిన 47 మంది విద్యార్థులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ల్యాప్‌టాప్‌లు అందజేశారు. వారందరికీ రెండేళ్ళపాటు కంప్యూటర్ కోర్సులలో శిక్షణ కూడా ఇప్పిస్తానని కేటీఆర్‌ ప్రకటించారు. పార్టీలో నేతలు తనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం కంటే ఈవిదంగా అనాధపిల్లలకు యధాశక్తిన సహాయం చేస్తే చాలా సంతోషిస్తానని చెప్పారు.