తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థ శాస్వితంగా రద్దు

తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాస్వితంగా రద్దు చేయాలని నిర్ణయించిన్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. దానిలో 20,555 మంది పనిచేస్తున్నారు. వారందరినీ నిబందనల ప్రకారం వివిద శాఖలలో నియమించనున్నట్లు ప్రకటించారు. వారి విద్యార్హతలు, వయో పరిమితిని బట్టి వారికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలిపారు. 

వారిలో 61 ఏళ్ళు పైబడినవారు 3,700 మంది ఉన్నారు. వారిని ఉద్యోగాలలో తీసుకోవడం సాధ్యం కాదు కనుక మానవతా దృక్పదంతో వారి వారసులకు విద్యార్హతలను బట్టి ఉద్యోగాలలోకి తీసుకొంటామని ప్రకటించారు. అలాగే చనిపోయిన వీఆర్ఏలను కూడా గుర్తించి వారి వారసులకు కూడా తగిన ఉద్యోగాలలోకి తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు. 

వీఆర్ఏలలో కొంతమంది నిరక్షరాస్యులున్నారు. కొంతమంది 7, 10వ తరగతి వరకు మాత్రమే చదివినవారున్నారు. మరికొందరు డిగ్రీ ఆపైన కూడా చదివినవారున్నారు. కనుక వారి విద్యార్హతలను బట్టి వివిద శాఖలలో వివిద పోస్టులలో భర్తీ చేయబడతారు. డిగ్రీ ఆపైన విద్యార్హత కలిగిన వారిని జూనియర్ అసిస్టెంట్స్, పురపాలక శాఖలో అయితే వార్డు అధికారులుగా నియమిస్తారు. ఇంటర్ అర్హత కాగిలిన వీఆర్ఏలను రికార్డ్ అసిస్టెంట్స్ గా, పదో తరగతి వరకు చదివిన వారికి హెల్పర్లుగా, అంతకంటే తక్కువ లేదా నిరక్షరాశ్యులకు ప్యూన్ లేదా ఆ స్థాయి ఉద్యోగాలలోకి తీసుకొంటారు. 

వీఆర్ఏల ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.