
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈసారి తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదు కనుక తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నానని మీడియాకు చెప్పారు. ఒకవేళ సిఎం కేసీఆర్ తన కుమారుడికి కాక వేరెవరికి ఇచ్చినా తాను అభ్యంతరం చెప్పానని కానీ తన కుమారుడికి ఇస్తే చాలా సంతోషిస్తానని అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డితో తనకు ఎటువంటి భేధాభిప్రాయాలు లేవని అన్నారు. అయితే మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీలో గ్రూపులు సృష్టిస్తూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా రాజకీయాలలో తాను ఎక్కువ కలుగజేసుకోనని కానీ జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తుంటానని అన్నారు. ఏ పార్టీలోనైనా నేతల మద్య చిన్న చిన్న భేధాభిప్రాయాలు ఉండటం సహజమే అని అన్నారు. పార్టీలో నేతలు తమకు నచ్చిన అధికారులను తాము కోరుకొన్నచోటికి బదిలీ చేయించుకొనే ప్రయత్నంలో పరస్పరం ఘర్షణ పడుతుంటారని అన్నారు. అయితే తానెన్నడూ ఇటువంటి వ్యవహారాలలో తలదూర్చలేదన్నారు.
ఈసారి శాసనసభ ఎన్నికలలో వామపక్షాలు బిఆర్ఎస్ పార్టీతో కలిసే ఉంటాయని భావిస్తున్నానని, ఒకవేళ వారితో పొత్తులు ఉంటే దానిని బట్టి సీట్ల సర్దుబాట్లు ఉంటాయి కనుక ఆ తర్వాతే ఎవరెవరికి సీట్లు దక్కుతాయో తెలుస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.