కిషన్‌రెడ్డిని బాధ్యతలు చేపట్టినరోజే పార్టీలో లుకలుకలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆయనను అభినందించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, గతంలో తనపై కొందరు ఢిల్లీ వెళ్ళి పార్టీ అధిష్టానానికి పిర్యాదులు చేశారని కనుక మళ్ళీ కిషన్ రెడ్డిపై కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేయకుండా ఆయనని ప్రశాంతంగా పనిచేసుకోనీయాలని హితవు పలికారు.

నాయకులు ప్రజల మద్య ఉండాలి కానీ టీవీలు, న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో కాదని, తాను ఆవిదంగానే నిత్యం ప్రజల మద్య ఉంటూ వారి కోసం పోరాడుతూ రెండుసార్లు జైలుకి కూడా వెళ్ళివచ్చానని అన్నారు. హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని ఉద్దేశ్యించే బండి సంజయ్‌ చురకలు వేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది.

ఆయన బండి సంజయ్‌కు తెలియకుండా ఢిల్లీకి వెళ్ళి అక్కడ మూడు రోజులు మకాం వేసి బిజెపి పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాతే బండి సంజయ్‌ని మార్చడం జరిగింది. అయితే బండి చురకలపై ఈటల రాజేందర్‌ స్పందించలేదు. 

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. బండి సంజయ్‌ రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారని, ఆయన నేతృత్వంలోనే మూడు ఉపఎన్నికలు జరుగగా వాటిలో రెంటిలో బిజెపి విజయం సాధించిందని అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో శాసనసభ ఎన్నికలలో బిజెపిని గెలిపించుకొని రాష్ట్రంలో అధికారంలో తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన విజయశాంతి కొంతసేపు ఉండి మద్యలోనే వెళ్ళిపోవడంతో ఆమె కూడా ఏదో విషయంలో అసంతృప్తిగా ఉన్నారని అర్దమవుతోంది.