కాస్త ఓపిక పట్టండి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోంది: బండ్ల గణేశ్

ఒకప్పుడు సినిమాలలో హాస్య నటుడుగా చేసిన బండ్ల గణేశ్ ఆ తర్వాత హటాత్తుగా పెద్ద నిర్మాతగా మారి పెద్ద హీరోలతో సినిమాలు తీశారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లు ఏ రంగంలోనైనా రాణించిన తర్వాత అందరి దృష్టి రాజకీయాలపైనే పడుతుంది. ముందు ఎమ్మెల్యే అయితే చాలనుకొంటారు. తర్వాత మంత్రి అవ్వాలనుకొంటారు. వీలైతే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కావాలని కోరుకొంటారు.

బండ్ల గణేశ్ కూడా 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొన్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియా, సోషల్ మీడియాలో చాలా హడావుడి చేశారు. కానీ టికెట్‌ దొరక్కపోవడంతో రాజకీయ వైరాగ్యం చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ప్రసూతీ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అన్నట్లు రాజకీయ వైరాగ్యం కూడా క్రమంగా తగ్గిన్నట్లుంది. అందుకే మళ్ళీ రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్దపడుతున్నట్లున్నారు. ఆయన తాజా ట్వీట్‌ ఇందుకు నిదర్శనం. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే... “నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం. ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటాం. దయచేసి ఈ నాలుగు నెలలు భరించండి.’’ 

అంటే కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు అర్దమవుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్‌ విజయావకాశాలు పెరిగినందున టికెట్స్ కోసం చాలామంది పోటీ పడతారు. కనుక బండ్ల గణేశ్‌కు మరోసారి నిరాశ తప్పదేమో?