తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై వారాల జల్లులు కురిపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో మైనార్టీలపై ఆ జల్లు కురిపించబోతోంది. ఈరోజు ఉదయం నాంపల్లిలోని జలవిహార్ ముస్లిం మైనార్టీల ప్రతినిధులతో మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్యే షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ అందరూ సంక్షేమం కోరుకొంటారు. అందుకే మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.2,200 కోట్లు కేటాయించాము. మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాము. మైనార్టీ విద్యార్థులు కూడా బాగా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకొంటున్నారు.
మైనార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్ మహమూద్ అలీకి కీలకమైన హోమ్ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. సిఎం కేసీఆర్ మరో కొత్త పధకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటి రెండు రోజులలో దానికి సంబందించి జీవో విడుదల కాబోతోంది. ఈ పధకం కింద మైనార్టీలలో అర్హులైనవారికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందజేయబడుతుంది. దాంతో వారు తమకు నచ్చిన వృత్తి లేదా వ్యాపారం చేసుకొని జీవితంలో రాణించవచ్చు,” అని అన్నారు.