కాంగ్రెస్‌లోకి ముథోల్ బిఆర్ఎస్ నేతలు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున అప్పుడే రాజకీయ నాయకులు పార్టీలు మారడం ప్రారంభం అయ్యింది. అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం గమనిస్తే బిఆర్ఎస్‌లో అసంతృప్తి నెలకొందని, కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అర్దమవుతోంది. 

నిర్మల్ జిల్లా ముథోల్ మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, బిఆర్ఎస్‌ నాయకులు విశ్వనాథ్ పటేల్, సాయిబాబా తదితరులు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సోమవారం భేటీ అయ్యారు. వీరందరూ ముథోల్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అనుచరులే. బిఆర్ఎస్‌ పార్టీలో ఎంత కష్టపడుతున్నా తమకు గుర్తింపు, గౌరవం లభించడం లేదనే అసంతృప్తితోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఏ పార్టీలో అయినా నాయకులు ఇలా పార్టీలు మారడం సహజమే కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత బలహీనపడకుండా నిలద్రొక్కుకోగలిగితే పర్వాలేదు. మరి తన ముఖ్య అనుచరులను కోల్పోతున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎన్నికలలోగా ఈ లోటును తిరిగి భర్తీ చేసుకోగలరా లేదో చూడాలి.