మా నాన్న ముత్తిరెడ్డి వెరీ బ్యాడ్ మ్యాన్!

జనగాం బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎటువంటివాడో ఆయన సొంత కూతురే చెపుతున్నారు. ఆయన కుమార్తె తూల్జా భవానీ మళ్ళీ తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్న ఓ అవినీతిపరుడు. భూకబ్జాలు చేస్తుంటాడు. కబ్జా చేసిన భూమిని నా పేరున రిజిస్టర్ చేయించి ప్రహారీ గోడ కూడా కట్టించి నాకు ఇస్తే నేనే దగ్గరుండి ఆ గోడను కూల్చివేయించి ఆ స్థలాన్ని మళ్ళీ జనగాం మునిసిపల్ అధికారులకు అప్పగించాను.

ఆ స్థలాన్ని కబ్జా చేశానని నా తండ్రి స్వయంగా ఓపుకొన్నారు కూడా. అయినా సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ మా నాన్నపై ఎందుకు చర్యలు తీసుకోరో నాకు అర్దంకాదు. అటువంటి అవినీతిపరుడు, భూకబ్జాలు చేసే మా నాన్న వలన వారికి, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా?

 నేనే మా నాన్న అవినీతిని బయటపెడుతుండటంతో ఆయన రాజకీయాలు చేస్తున్నారు. నా వెనుక ఓ పార్టీ ఉందని, ఆ పార్టీ నేతలే నా చేత తన మీద ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారని మా నాన్న వాదిస్తుండటం ఆరోపణల నుంచి తప్పించుకొనేందుకే కదా?

జనగాం ప్రజలు కేసీఆర్‌ మొహం చూసే మా నాన్నను గెలిపిస్తున్నారు తప్ప మా నాన్న మొహం చూసి కాదు. ఒకవేళ బిఆర్ఎస్ కాదంటే మానాన్న కనీసం పంచాయతీ ఎన్నికలలో కూడా గెలవలేదు. కానీ మా నాన్న ఇంత అవినీతిపరుడని తెలిసి ఉన్నా ఒకవేళ కేసీఆర్‌, కేటీఆర్‌ ఆయనను వెనకేసుకు వచ్చి మళ్ళీ టికెట్‌ ఇస్తే, ఈసారి ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలి,”  అని విజ్ఞప్తి చేశారు.