కాంగ్రెస్‌ మనసులో విషమే రేవంత్‌ రెడ్డి బయటపెట్టాడు!

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యవసాయానికి 8 గంటలు ఉచిత విద్యుత్‌ చాలంటూ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “ఒకప్పుడు కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయానికి విద్యుత్‌ ఈయలేదు. నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, నీళ్ళు, ఇంకా రైతు బంధు వంటి అనేక సంక్షేమ పధకాలు కూడా అందిస్తోంది. కాంగ్రెస్  ప్రభుత్వం చేయలేని పనులను మా ప్రభుత్వం చేస్తుంటే చూసి అభినందించాలి. కానీ మళ్ళీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ బంద్ చేస్తామని నిసిగ్గుగా రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

రైతులకు ఎప్పుడు ఎంత విద్యుత్‌ అవసరమో ఈ కాంగ్రెస్ నేతలలో ఎవరికైనా తెలుసా?విద్యుత్ అందుబాటులో ఉంటే రైతులు తమ అవసరమైనప్పుడు ఎంత కావాలో అంతే వాడుకొంటారు. మరి దానిలో దుబారా, అవినీతి జరుగుతోందని రేవంత్‌ రెడ్డి ఎలా వాదిస్తున్నారు? కాంగ్రెస్‌ నేతలు వాళ్ళు చేయరు. చేయలేరు. ఇతరులను చేయనీయరు,” అంటూ నిప్పులు చెరిగారు. 

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “ అసలు ఈ ఉచిత విద్యుత్‌ ప్రస్తావన తెచ్చింది మీరే కదా? మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తారెందుకు? ఒకవేళ ఉచిత విద్యుత్‌ ఈయకూడదనుకొంటే అదే విషయం మీరే ప్రజలకు చెప్పండి. ఒకవేళ 24 గంటలూ ఉచిత విద్యుత్‌ ఈయాలనుకొంటే, మీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అందించి నిరూపించి చూపండి. 

ఇదివరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ అర్ధరాత్రి, తెల్లవారుజామున విద్యుత్‌ ఇస్తుంటే, దాని కోసం రైతులు నిద్ర మానుకొని పొలాలలో కాపలాకాయాల్సి వచ్చేది. రాత్రిపూట పొలాలలో పాములు కరిచి అనేకమంది రైతులు చనిపోయారు. ఇదంతా మీ పుణ్యమే కదా? ఇళ్ళకు, ఫ్యాక్టరీలకు, షాపింగ్ మాల్స్‌కు 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఉండాలి కానీ పొలాలకు వద్దా?

తెలంగాణలో వ్యవసాయం అంటే బోరుబావుల వ్యవసాయం. గత యాసంగిలో బోరుబావులు, ఎత్తిపోతల నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందాయి. 24 గంటలు ఉచిత విద్యుత్‌ లేకుంటే ఇది సాధ్యమవుతుందా? అయినా కాంగ్రెస్ పార్టీ మనసులో దాచుకొన్న విషాన్ని రేవంత్‌ రెడ్డి ముందుగానే బయటపెట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమవుతుందో ముందే చెప్పేశారు. కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి,” అన్నారు.