తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పేర్లను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ ఖరారు చేశారు. దీనికి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ ఆమోదముద్రవేసి వారిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ డివిజన్ అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లుగా, తహశీల్దారులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియమిస్తోంది. త్వరలోనే తెలంగాణ ఎన్నికల సంఘం వీరి వివరాలను తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు, జోనల్ కమీషనర్లకు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో సమన్వయ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గాలకు మునిసిపల్ అధికారులు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమింపబడతారు.
ఈ ఏడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం గడువు పూర్తవుతుంది. కనుక దానికి మూడు నెలల ముందుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ప్రభుత్వం గడువుకు 7-10 రోజుల ముందుగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తిచేయవలసి ఉంటుంది. కనుక సెప్టెంబర్ నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.