కేసీఆర్‌గారు నన్ను మరిచిపోకండి.... నాకూ టికెట్‌ కావాలి!

తెలంగాణ రాజకీయాలలో అత్యంత సీనియర్ నాయకులలో మోత్కుపల్లి నర్సింహులు కూడా ఒకరు. సమైక్య రాష్ట్రంలో ఆయన టిడిపిలో తిరుగులేని నాయకుడుగానే ఉండేవారు. 1983 నుంచి 1999 వరకు ఆలేరు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారంటే అర్ధం చేసుకోవచ్చు. 

కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టిడిపి తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన పరిస్థితి తారుమారు అయ్యింది. ఆయన 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2018లో బిఆర్ఎస్ టికెట్‌ కోసం ఎంతగా తాపత్రయపడినప్పటికీ కేసీఆర్‌ ఆయనను పట్టించుకోకపోవడంతో ఆలేరు నుంచే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ ఏనాడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. ఆయన కూడా ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు. 

ఇప్పుడు శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కేసీఆర్‌కు నేను కూడా పార్టీలోనే ఉన్నాను. ఆలేరు నుంచి పోటీ చేయాలనుకొంటున్నాని చెప్పేశారు. 

ఆలేరు మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, “ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండేందుకు నేనేమీ సన్యాసిని కాను. ఇన్నేళ్లు ప్రజల మద్యన తిరిగిన నాకు ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే కాళ్ళు నిలవడం లేదు. కేసీఆర్‌ టికెట్‌ ఇస్తే నేను మళ్ళీ ఆలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నాను. ఒకవేళ అక్కడి నుంచి కాకపోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా నేను సిద్దంగా ఉన్నాను. కేసీఆర్‌ ఆశీర్వచనాలు నాకున్నాయనే భావిస్తున్నాను,” అని అన్నారు.