తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించలేదు: బొత్స

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో విద్యావ్యవస్థతో ఏపీవిద్యావ్యవస్థను పోల్చి చూడటం సరికాదు. అక్కడ విద్యావ్యవస్థ ఏవిదంగా అందరూ చూస్తూనే ఉన్నారు.

పరీక్షలకు ప్రశ్నాపత్రాల లీకేజీ అవుతుండటం, తర్వాత కేసులు, దర్యాప్తులు, పరీక్షలలో విద్యార్థులు కాపీలు కొట్టడం వంటివి అక్కడ జరుగుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కనీసం టిఎస్‌పీఎస్సీని సరిగ్గా నిర్వహించుకోలేక, టీచర్ల బదిలీ ప్రక్రియను కూడా పూర్తిచేయలేకపోతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో విద్యావ్యవస్థ అద్భుతంగా ఉంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది,” అని అన్నారు. 

దీనిపై తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్ గౌడ్‌ వెంటనే స్పందిస్తూ, ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 9 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేక దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో డయల్ 100కి ఒక్క ఫోన్‌ కాల్ రాగానే తెలంగాణ పోలీసులు రంగంలో దిగి పాతాళంలో దాక్కొనవారిని కూడా పట్టుకొనితెచ్చి జైల్లో వేస్తున్నామన్నారు. 

ఏపీలో రోడ్ల పరిస్థితి ఏవిదంగా ఉందో, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. నేటికీ ఏపీ మంత్రులకు జబ్బు చేస్తే హైదరాబాద్‌కే వస్తుంటారని ఎద్దేవా చేశారు. ఏపీలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణకు వస్తుంటే వారందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నామని, కానీ ఈ 9 ఏళ్లలో తెలంగాణ నుంచి ఎంత మంది ఏపీకి వలసలు వచ్చారో చెప్పాలని మంత్రులు నిలదీశారు. 

ఏపీ గురించి తాము చులకన మాట్లాడాలనుకోవడం లేదని ఏపీలో వాస్తవ పరిస్థితులనే మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణకు గుర్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ గురించి చాలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడినా మంత్రి బొత్సను తక్షణం ఆ పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి బొత్స తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాకనే హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని వారు సూచించారు.