బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి యాగంలో మంచు దంపతులు

వికారాబాద్‌ జిల్లా తాండూరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు 11 రోజుల క్రితం మొదలుపెట్టిన రాజశ్యామల అతిరుద్ర మహాయాగం నేడు పూర్ణాహుతితో సమాప్తం అయ్యింది. అయితే పూర్ణాహుతి జరిగే ముందు మండపంలో చిన్న అగ్నిప్రమాదం జరిగింది. అయితే వెంటనే మంటలు ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ యాగంలో నూతన దంపతులు మంచు మనోజ్, మౌనికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి 1008వ జగద్గురువు శ్రీ చంద్రశేఖర్ శివాచార్య హాజరయ్యారు. ఆయనకు పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు కాళ్ళు కడిగి ఆశీర్వచనాలు తీసుకొన్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వికారాబాద్‌లో ఎస్పీ కోటిరెడ్డి తదితరులు హాజరయ్యారు.   

గత ఏడాది నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రతినిధులు ప్రధానంగా ఆయనతోనే చర్చలు జరిపారు. ఆయనే వారిని ఏసీబీ అధికారులకు రెడ్  హ్యాండ్‌గా పట్టించారు. ఆ తర్వాత బిజెపి, బిఆర్ఎస్ మద్య భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు నెలరోజులపాటు సిఎం కేసీఆర్‌ ఆయనను ప్రగతి భవన్‌లోనే ఉంచుకొన్నారు. ఆ తర్వాత హటాత్తుగా రెండు పార్టీలు చల్లబడిపోయాయి. అది వేరే విషయం. 

కానీ ఈ ఏడాది జనవరిలో పైలట్ రోహిత్ రెడ్డి కారులో బెంగళూరు నుచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. అయితే అది బులెట్ ప్రూఫ్ వాహనం కావడంతో పైలట్ రోహిత్ రెడ్డి ప్రాణాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.