హిమాన్షు... కల్వకుంట రాజకీయ వారసుడే... నో డౌట్!

సిఎం కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు ఈరోజు మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ఓ స్కూల్లో జరిగిన సభలో మాట్లాడారు. ఇదే తన తొలి బహిరంగ ఉపన్యాసమని చెపుతూనే హిమాన్షు ఏమాత్రం తడబడకుండా అనర్గళంగా మాట్లాడి తన తాతగారు, తండ్రికి తగ్గ తనయుడినే అని నిరూపించుకొన్నాడు. 

హైదరాబాద్‌ గౌలిదొడ్డిలోని కేశవ నగర్‌లో శిధిలావస్థకు చేరుకొన్న ప్రభుత్వ పాఠశాలను హిమాన్షు తన సహచర విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇంకా కొన్ని సంస్థల సహాయసహకారాలతో పునర్నిర్మించారు. ఈరోజు దాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనప్పుడు, హిమాన్షు అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఈ పాఠశాలకు మరమత్తులు చేయించాలని కోరుతూ తమకు అభ్యర్ధన వచ్చినప్పుడు, తమ స్కూల్ ప్రిన్సిపల్ ఈ బాధ్యతను తనకు అప్పగించారని చెప్పాడు. పాఠశాలకు ప్రహారీ గోడ కడితే సరిపోతుందని అనుకొని వస్తే పాఠశాల దుస్థితి చూసి కనీళ్లు పెట్టుకొన్నానని చెప్పాడు. 

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిపోవడమో లేదా ప్రహారీగోడ నిర్మిస్తే సరిపోదని కేసీఆర్‌ మనుమడిగా ఏదైనా గొప్పగా చేయాలనే ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకొని పూర్తిచేశానని హిమాన్షు చెప్పాడు. ఈ పాఠశాలను పూర్తిగా పునరురిద్దరించాలని నిర్ణయించుకొని రెండు పెద్ద ఈవెంట్స్ చేసి రూ.40 లక్షలు సేకరించానని, మిగిలిన సొమ్ముని సామాజిక బాధ్యతగా కొన్ని సంస్థలు సమకూర్చడంతో పాఠశాలను పూర్తిగా పునర్నిర్మించగలిగామని చెప్పాడు. 

తన తాతగారు, తల్లితండ్రులు, తన స్కూల్లో ఉపాధ్యాయులు, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, తన సహచర విద్యార్థులు, స్నేహితులు, పలు సంస్థలు అందరూ తోడ్పడటంతో ఇది సాధ్యమైందని కనుక ఇది మన అందరి సమిష్టి కృషి ఫలితమే అని హిమాన్షు చెప్పాడు. 

ఇది నా మొట్ట మొదటి బహిరంగ ఉపన్యాసం అంటూనే, తన తాతగారు, తండ్రిలాగా చెప్పదలచుకొన్న అన్ని విషయాలను చాలా చక్కగా విడమరిచి చెప్పడంతో కల్వకుంట్ల కుటుంబంలో మరో నాయకుడు ఉద్భవించినట్లే భావించవచ్చు. 

అయితే సాక్షాత్ సిఎం కేసీఆర్‌ మనుమడు, రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కుమారుడు హిమాన్షు నోట ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి విన్నప్పుడు, అదీ... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పక్కనే కూర్చొని ఉన్నప్పుడు... ప్రభుత్వ వైఫల్యం లేదా నిర్లక్ష్యం కళ్ళకు కట్టిన్నట్లు చూపించినట్లయింది కూడా. నగరంలో, రాష్ట్రంలో ఇంకా అనేక ప్రభుత్వ పాఠశాలలో ఇంతకంటే దయనీయమైన పరిస్థితులే ఉన్నాయి. కనుక ఇకనైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే వాటికి మరమత్తులు చేయించడమో లేదా పునర్నిర్మాణం చేయిస్తే బాగుంటుంది.