వీఆర్ఏ, జేపిఎస్‌లకు శుభవార్త

తెలంగాణ వీఆర్ఏ, జేపిఎస్‌లకు ఓ శుభవార్త! వీఆర్ఏలను జలవనరులు తదితర శాఖలలో సర్దుబాటుచేసి వారి సేవలను వినియోగించుకోవాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకుగాను మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలతో ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.వీరు సంబందిత అధికారులతో, వీఆర్ఏలతో చర్చించి వారం రోజులలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ తెలియజేశారు.

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను తొలగించిన సంగతి తెలిసిందే. వారు అవినీతికి పాల్పడుతూ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారని ప్రభుత్వం వాదించింది. కానీ మానవతా దృక్పధంతో లేదా రాజకీయ కారణాలతో ఇప్పుడు వారందరినీ వివిద శాఖలలో సర్దుబాటు చేసేందుకు సిద్దపడుతోంది.  

అలాగే జేపిఎస్‌ల ఉద్యోగాలను క్రమబద్దీకరించడానికి విధివిధానాలను రూపొందించాలని సిఎం కేసీఆర్‌ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలు జేపిఎస్‌ల పనితీరుని సమీక్షించి సిఫార్సు చేస్తాయి.

ఈ కమిటీలలో అధనపు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ, జిల్లా ఫారెస్ట్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫార్సులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి సీఎస్ శాంతికుమారికి సమర్పిస్తుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం జేపిఎస్‌లను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా జేపిఎస్‌లు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 16 రోజులు సమ్మె చేయగా, తక్షణం సమ్మె విరమించి విధులలో చేరకపోతే ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించి సమ్మె చేసినందుకు అందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తాంని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడంతో వారు సమ్మె కొనసాగించి ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వం దిగివచ్చింది.