
ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు తెలంగాణ సిఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిసి చర్చించారు.
అనంతరం సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “భిన్న సంస్కృతులు, మతాలు, భాషల ప్రజలు ప్రశాంతంగా కలిసి మెలిసి జీవిస్తుంటే, మోడీ ప్రభుత్వం వారి మద్య ఈ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఇంతకంటే అనేక ముఖ్యమైన సమస్యలున్నాయి. మోడీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన సమస్యలు సృష్టిస్తోంది. దీనిని మేము పార్లమెంట్ లోపల, బయటా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము,” అని చెప్పారు.
మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విలేఖరులతో మాట్లాడుతూ, “ఈ బిల్లు వలన కేవలం ముస్లింలకు మాత్రమే కాదు హిందువులు కూడా నష్టపోతారు. హిందూ అవిభాజ్య కుటుంబం, హిందూ వివాహ చట్టం కూడా రద్దవుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది గిరిజనులకు రక్షణ కల్పిస్తున్న చట్టాలు కూడా దీంతో రద్దవుతాయి. కనుక దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. త్వరలోనే బిజెపియేతర పార్టీలను ముఖ్యమంత్రులను కలిసి ఈ బిల్లుకి వ్యతిరేకంగా మద్దతు కూడగతాము,” అని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నప్పటికీ, బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ కలిపి వాటి మద్య బంధాలు బలపడేందుకు ఇది మరింత దోహదపడుతుందని భావించవచ్చు.