జూపల్లి కూడా ముహూర్తం పెట్టేసుకొన్నారుగా

బిఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి బహిష్కరింపబడ్డారు. ఇద్దరూ కలిసే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డారు. అయితే ఖమ్మం సభలో పొంగులేటి ఒక్కరే కాంగ్రెస్‌లో చేరారు కానీ జూపల్లి చేరలేదు. బహుశః ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టికెట్ల విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం హామీ ఇవ్వడంలో ఆలస్యం జరిగి ఉండవచ్చు. బహుశః ఇప్పుడు హామీలు లభించిన్నట్లున్నాయి అందుకే ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకొన్నారు. ఆయనతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 

ఆరోజు కొల్లాపూర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆ బహిరంగసభ నిర్వహణ గురించి మాట్లాడేందుకు జూపల్లి కృష్ణారావు తదితరులు సోమవారం భట్టి విక్రమార్క నివాసానికి వెళ్ళి సుదీర్గంగా మాట్లాడుకొన్నారు. 

అనంతరం భట్టి విక్రమార్క విలేఖరులతో మాట్లాడుతూ, “కొల్లాపూర్ సభకు ఢిల్లీ నుంచి జాతీయ కాంగ్రెస్‌ నేతలు రాబోతున్నారు. ఈ సభ ఖమ్మం సభ కంటే భారీ ఎత్తున నిర్వహించబోతున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్‌లో పనిచేసిన జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తుండటం చాలా శుభపరిణామం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 100 అసెంబ్లీ సీట్లు, జాతీయస్థాయిలో 300 ఎంపీ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.