మరో 45 రోజులలో అసెంబ్లీ రద్దు?

మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌ అప్పుడే ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించింది కూడా. బహుశః సెప్టెంబర్‌ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే మరో 45 రోజులలో తెలంగాణ శాసనసభ రద్దు అయిపోతుందంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, కేసీఆర్ ఇప్పుడేమీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు. కనుక తన ప్రభుత్వం గడువు తీరేవరకు బిఆర్ఎస్ పార్టీయే అధికారంలో కొనసాగుతుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఎన్నికలు జరుగుతాయి. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈవిదంగా ఎందుకన్నారో ఆయనకే తెలియాలి. 

ఈరోజు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న కారణంగా నేను పిసిసి అధ్యక్ష పదవి ఆశించిన మాట వాస్తవం. అది దక్కనప్పుడు చాలా బాధపడిన మాట వాస్తవమే. అయితే అదంతా గతం. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క అందరితో కలిసి పనిచేస్తున్నాను.

జిల్లాలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు ఉన్నప్పుడు, ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎమ్మెల్సీ, మిగిలిన వారికి జిల్లా పరిషత్ ఛైర్మన్ వంటి పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకొంటాను. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రావడమే అందరి లక్ష్యం కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి కాంగ్రెస్‌ను గెలిపించుకొని బహుమతిగా అందిద్దాం,” అని అన్నారు.