నాగర్‌కర్నూలు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగులబోతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీ చంద్ నిన్న పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమానికి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి హాజరయ్యారు!
ఆయన బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు. ఇటీవల సిఎం కేసీఆర్ గద్వాల్లో బహిరంగసభ నిర్వహించినప్పుడు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి దానిలో కూడా పాల్గొన్నారు. తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూడా ఆయనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కనుక పార్టీని వీడుతున్నట్లు ఎటువంటి ముందస్తు సంకేతాలు ఇవ్వలేదు.
కానీ హటాత్తుగా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యి పార్టీలో నేతలందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు తెలుస్తోంది. కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి దాదాపు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కనుక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం సంతోషమే. అయితే నాగర్‌కర్నూలు నుంచి నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక ముందుగా ఆయనతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకొంటానని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి చెప్పారు.
తనకు కాకపోయినా తన కుమారుడికి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరుకావడంపై బిఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకవేళ బిఆర్ఎస్ షోకాజ్ నోటీస్ జారీ చేస్తే వెంటనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతానని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి చెప్పారు.