జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మద్య గత 9 ఏళ్లుగా రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తుండటమే అందుకు కారణం.
సిఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తానని ప్రకటించినప్పటికీ,కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌ను వదులుకొనేందుకు సిద్దంగా లేరు. దీంతో వారిరువురి మద్య ఘర్షణ కొనసాగుతోంది.
ఎమ్మెల్యే రాజయ్య నిన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “కడియం శ్రీహరి రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఇప్పుడు ఆయన దగ్గర వందలు కోట్లున్నాయి. ఇంత తక్కువ కాలంలో ఆయన ఇంత ఏవిదంగా సంపాదించారో చెప్పాలి?ఆయన నేరుగా నన్ను ఎదుర్కొలేక చాలా నీచ రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆయన ఎన్ని కుట్రలు చేస్తున్నా వచ్చే ఎన్నికలలో మళ్ళీ నాకే టికెట్ లభిస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి నేనే పోటీ చేసి గెలుస్తాను,” అని అన్నారు.
ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాదంటూ జానకీపురం సర్పంచ్ నవ్య ధర్మానగర్ పోలీసులకుఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. మహిళా సర్పంచ్ వెనుక కడియం శ్రీహరి ఉన్నారని రాజయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కడియం శ్రీహరి, రాజయ్య ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా చేసినవారే. ఇద్దరూ సీనియర్లే. ఇద్దరు దళితులే. అయితే రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించినప్పటికీ, 2018 ముందస్తు ఎన్నికలలో ఆయనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయనపై మహిళా సర్పంచ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక రాజయ్యవైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని భావించవచ్చు. బహుశః అందుకే రాజయ్య కూడా కడియం శ్రీహరిని ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శిస్తున్నారని భావించవచ్చు.