మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన పగడాల కృష్ణారెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఆయన మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కొరకు కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తరలించి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి తలకు తీవ్ర గాయమయ్యి మెదడులో రక్తనాళాలు చిట్లడంతో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నలేవీ ఫలించలేదు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉద్యమ సమయం నుంచి కృష్ణారెడ్డితో మంచి అనుబందం ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు తదితరులు ఆయనకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.