కేసీఆర్‌ ఒత్తిడి వల్లే బండి సంజయ్‌ని తొలగించారు: విహెచ్

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికలకు ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తప్పించడానికి ఆ పార్టీలో అంతర్గత కలహాలు కారణమని నేను భావించడం లేదు. ఆయన కేసీఆర్‌ను చాలా ధీటుగా ఎదుర్కొంటుండటంతో కేసీఆర్‌ ఒత్తిడి మేరకే ఆ పదవిలో నుంచి తప్పించారని నేను భావిస్తున్నాను. ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తొలగించడం ద్వారా బిజెపికి బిఆర్ఎస్‌ బీ-టీమ్‌ అని ఖచ్చితంగా నిరూపితమైంది. బిజెపి, బిఆర్ఎస్‌ ఆడిన చదరంగంలో బీసీ బిడ్డ అయిన బండి సంజయ్‌ బలైపోయారు. 

కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయిన మైనార్టీలు, బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ కూడా మైనార్టీలు, బీసీలు బిజెపికి బీ-టీమ్‌గా పనిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయారు. కనుక ఈసారి శాసనసభ ఎన్నికలలో వారు తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని సమస్యలున్న మాట వాస్తవం. అయితే ప్రతీ పార్టీలో ఇటువంటి సమస్యలు ఉంటాయి. కనుక వాటిని మాలో మేము చర్చించుకొని పరిష్కరించుకొంటాము. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం,. అందుకే పార్టీని వీడి వెళ్ళిపోయిన నేతలు తిరిగి వస్తున్నారు. వారి చేరికతో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడుతుంది. 

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఆయన నాయకత్వంలో ఈసారి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే బడుగు బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజలకు భద్రత, భరోసా లభిస్తుంది,” అని వి.హనుమంతరావు అన్నారు.